“నాగబాబు (Naga Babu) నాతో పాటు సమానంగా పని చేశారు. వైఎస్సార్సీపీ నేతలతో తిట్లు తిన్నారు. పార్టీ కోసం నిలబడ్డారు. కులం, బంధుప్రీతి కాదు.. పదవి ఇవ్వాలంటే పని మంతుడా కాదా అన్నది మాత్రమే చూస్తాం. రాజకీయాల్లో పని తీరే ప్రామాణికం. కలిసి పని చేసిన వారిని గుర్తించాల్సిన బాధ్యత నాకు ఉంది.” అని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. సోమవారం మంగళగిరిలో ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు.

ఈ సందర్భంగా తన సోదరుడు, జనసేన నాయకుడు అయిన నాగబాబుకు (Naga Babu Ministry) మంత్రి పదవి ఇచ్చే విషయమై పవర్ స్టార్ స్పందించారు. తమకు బ్యాక్‌గ్రౌండ్‌ లేకున్నా అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) సొంతంగా ఎదిగారని.. ఇప్పుడు తమ తర్వాత తరం పిల్లలకు ఒక బ్యాక్‌గ్రౌండ్‌ ఉందని తెలిపారు. తమతో ప్రయాణం చేసి, పనిచేసిన వారిని తాను గుర్తిస్తానని చెప్పారు. నాగబాబు తనతో పాటు సమానంగా పని చేశారని.. వైస్సార్సీపీ నేతలతో తిట్లు తిన్నారని వెల్లడించారు. ఆయణ్ను ఎంపీగా ప్రకటించి, మళ్లీ తప్పించామని పేర్కొన్నారు.

‘‘మనోహర్‌, హరిప్రసాద్‌ (Hari Prasad) మొదటి నుంచి పార్టీ కోసం పని చేశారు.  ప్రతిభ చూసి పదవులు ఇస్తాం. ఇదే విషయం మీరు జగన్‌ను అగడలేదు? కేవలం నన్ను మాత్రమే ఎందుకు అడుగుతున్నారు? నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు. మంత్రి పదవి విషయంలో తర్వాత చర్చిస్తాం. నాగబాబు త్యాగం గుర్తించి రాజ్యసభకు అనుకున్నాం. కానీ కుదరకపోవడంతో ఎమ్మెల్సీ అనుకున్నాం. కందుల దుర్గేష్‌ (Kandula Durgesh) ఏ కులమో నాకు తెలియదు. ఆయన పనితీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చాం. రాజకీయాల్లో కులం కాదు.. పని తీరే ప్రామాణికం’’ అని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.