
హైదరాబాద్ మీర్‌పేటలో గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య (Meerpet Murder Case) చేసి, ముక్కలుగా నరికిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న అతను పక్కా ప్లాన్ ప్రకారమే భార్యను హతమార్చినట్లు తెలిసింది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నిందితుడు.. ఆమెతో కలిసి ఉండేందుకు పథకం ప్రకారం తన భార్యను చంపినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం.
నేనే చంపాను.. ఆధారాలేవి?
ఈ కేసులో నిందితుడే స్వయంగా తాను తన భార్యను చంపేసినట్లు అంగీకరించినా.. ఆధారాలు లేకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అయితే భార్యను హతమార్చి ముక్కలుగా నరికి.. బకెట్ నీళ్లలో ఆ ముక్కలు ఉంచి హీటర్ తో ఉడికించి చివరగా మాంసాన్ని ముద్దగా మార్చి సమీపంలోని చెరువులో పడేసినట్లు విచారణలో నిందితుడు చెప్పినట్లు తెలిసింది. ఓ వెబ్ సిరీస్ చూసే అతను ఇంత పాశవికంగా ప్రవర్తించినట్లు సమాచారం.
ఆధారాల కోసం ఆరా
నిందితుడి ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు ఓ మహిళతో గురుమూర్తి సన్నిహితంగా ఉన్న ఫొటోలు గుర్తించారు. ఈనెల 18న మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు హత్య కేసు సెక్షన్ల కింద మార్చి దర్యాప్తు చేయనున్నారు. మృతదేహాన్ని ముద్దగా చేసి చెరువులో విసిరేసినట్లు నిందితుడు చెబుతున్నా ఆధారాలు లభించలేదని ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ తెలిపారు. మృతురాలు (మాధవి) శరీరం ఆనవాళ్లు లభ్యమైతే పిల్లల డీఎన్‌ఏతో పోల్చి చూడనున్నట్లు చెప్పారు.