జెంటిల్​మెన్​, భారతీయుడు, అపరిచితుడు, రోబో లాంటి సూపర్​హిట్​ మూవీస్​ అందించిన ప్రముఖ దర్శకుడు శంకర్​ (Director Shankar) మొట్టమొదటిసారి గ్లోబల్​స్టార్​ రామ్​చరణ్​తో​ డైరెక్ట్​ తెలుగు మూవీ తెరకెక్కించారు. ఈ పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందించిన‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) మూవీ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో శంకర్‌ వరుస ప్రమోషన్‌లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విమర్శల నుంచి ఎవరూ తప్పించకోలేరన్నారు. తాను కేవలం ఒకేఒక్కరి బయోపిక్​ తీస్తానని.. అది తలైవా రజినీ కాంత్​దేనని అన్నారు.

శంకర్​ డైరెక్షన్​లో గతేడాది రిలీజై ప్రేక్షకులను అలరించలేకపోయింది ‘ఇండియన్‌ 2’. దీంతో సోషల్‌ మీడియాలో శంకర్​పై విమర్శలు వచ్చాయి. వీటిపైనా తాజా ఇంటర్వ్యూలో శంకర్​ మాట్లాడుతూ.. ‘విమర్శలను ప్రతిఒక్కరూ జీవితంలో ఏదోఒక సమయంలో ఎదుర్కోవాల్సిందే. వాటినుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఎవరైనా.. దేనినైనా విమర్శించొచ్చు. అయితే, వాటినుంచి మనం ఏం నేర్చుకున్నామనేది ముఖ్యం. ఆ విమర్శలను సవాలుగా తీసుకొని తర్వాత ప్రాజెక్ట్‌ను మెరుగ్గా తీయాలి. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌తో నేను బిజీగా ఉన్నాను. ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత భారతీయుడు 3 పనులు ప్రారంభిస్తాను’ అని అన్నారు.

ఆయన మాట్లాడుతూ..‘రజినీకాంత్‌ గొప్ప వ్యక్తి. ఈ విషయం ఎంతోమందికి తెలుసు. నాకు ప్రస్తుతానికి బయోపిక్‌ను తెరకెక్కించాలనే ఆలోచన లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఆ ఆలోచన వస్తే రజినీకాంత్‌ (Rajinikanth) బయోపిక్‌నే తీస్తాను’ అని అన్నారు. ఈ కామెంట్స్ సినీప్రియుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఫ్యూచర్‌లో శంకర్‌ దర్శకత్వంలో రజినీకాంత్‌ బయోపిక్‌ వస్తుందని ఆశిస్తున్నారు. వీరి కాంబినేషన్​లో ఇప్పటికే శివాజీ, రోబో లాంటి సూపర్​హిట్​ మూవీస్​ వచ్చాయి.