
ఫ్యామిలీ గొడవలతో సతమతమవుతున్నా మంచు ఫ్యామిలీ తమ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప (Kannappa)’ ను పూర్తి చేయాలనే సంకల్పంతో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పరమేశ్వరుడికి ప్రీతికరమైన ప్రతి సోమవారం ఈ సినిమా నుంచి ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ వాటికి సంబంధించిన నటుల పోస్టర్లను రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే పలు పాత్రలకు సంబంధించి పలువురు నటుల పోస్టర్లను విడుదల చేసింది. కానీ ఈ చిత్రంలో హీరోయిన్ కు సంబంధించి అనౌన్స్ మెంట్ తప్ప వేరే అప్డేట్ ఇవ్వలేదు.
ఎట్టకేలకు ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ అప్డేట్ వచ్చేసింది. మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్న కన్నప్ప నుంచి హీరోయిన్ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది. చిత్ర యూనిట్ ఈ బ్యూటీ పాత్రను పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ”అందంలో సహజం.. తెగింపులో సాహసం.. ప్రేమలో అసాధారణం.. భక్తిలో పారవశ్వం.. కన్నప్పకి సర్వస్వం చెంచుల యువరాణి నెమలి (Nemali) అంటూ” ప్రీతి ముకుందన్ ఫస్ట్ లుక్‌ను పంచుకుంది.
దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు (Mohan Babu) నిర్మిస్తున్నారు. మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖ హీరోలు భాగం అవుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ (Prabhas), నయనతార, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి కీలక నటులు నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ద్వారా మంచు వారసులు అరియానా, వివియానా, అవ్రామ్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.