
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Indlu Scheme) ఆశావహులకు గుడ్ న్యూస్. ఈ ఇళ్ల పంపిణీలో భాగంగా 18వ తేదీన అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. 21వ తేదీ నుంచి గ్రామసభల్లో ఈ జాబితాను విడుదల చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. 26వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి కానుంది. మొదటి విడతలో సొంత స్థలం ఉండి నిరుపేదలైన వారికే ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
నియోజకవర్గానికి 3500 ఇండ్లు
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాలు, పట్టణాల వారీగా మంజూరు చేసిన వాటి వివరాలను జిల్లా ఇంఛార్జి మంత్రికి సమర్పిస్తే ఆయన ఆమోదించి ఎన్ని మంజూరయ్యాయో గ్రామసభల్లో ప్రదర్శిస్తారు. నిరుపేదలు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు ఈ ఎంపికలో ప్రాధాన్యమిస్తారు.
100 శాతం సర్వే పూర్తి
గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలో గురువారం వరకు ఇందిరమ్మ ఇళ్ల యాప్ సర్వే 97 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. 32 జిల్లాల్లో 69,83,895 దరఖాస్తులు ఉండగా 68,08,923 దరఖాస్తులను సర్వే చేసినట్లు వెల్లడించారు. సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలో 100శాతం, భద్రాద్రి కొత్తగూడె, నల్గొండ, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో 99 శాతం సర్వే పూర్తయిందని వివరించారు. మహబూబ్నగర్, మహబూబాబాద్, పెద్దపల్లి, వనపర్తి, జగిత్యాల, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 98శాతం సర్వే చేసినట్లు చెప్పారు. మిగతా జిల్లాల్లోనూ 100శాతం పూర్తి చేసి ఈ నెల 18న అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు.