
ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు(Telangana Intermediate Board) గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సిలబస్(Syllabus) తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు కెమిస్ట్రీ, ఫిజిక్స్‌తోపాటు పలు సబ్జెక్టుల్లో సిలబస్‌ను కుదించే యోచనలో ఉంది. తగ్గించిన సిలబస్‌ను 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్‌లో అమలు చేయనున్నట్లు బోర్డ్ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,700లకుపైగా ఇంటర్ కాలేజీలుండగా, వాటిలో 9.5లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, పరిమితికి మించి పలు సబ్జెక్టుల్లో సిలబస్ ఉన్నట్టు బోర్డు గుర్తించింది. ఈ నేపథ్యంలో సిలబస్‌లో మార్పులు చేయాలని ఇంటర్ బోర్డు(Intermediate Board) భావించింది.
ఎన్సీఈఆర్టీ(National Council of Educational Research and Training) సూచించిన సిలబస్ తోపాటు అడిషనల్ సిలబస్ ఉండడంతో దాన్ని తొలగించాలని నిర్ణయించింది. మరో పక్క JEE, NEETతోపాటు జాతీయస్థాయి పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని, సిలబస్ కుదించాలని డిసైడ్ అయింది. ఈ మేరకు ఈ వారంలోనే సబ్జెక్టుల వారీగా ఎక్స్‌పర్ట్ కమిటీ(Expert Committees)లను ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించనుంది. వారి ఆధ్వర్యంలో ఏ చాప్టర్లు తొలగించాలని, ఏ చాప్టర్లోని అంశాలను తగ్గించాలని అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఈమేరకు ఫస్టియర్, సెకండియర్ కెమిస్ట్రీలో 30% మేర కోత విధించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 6 చాప్టర్లను తొలగించనున్నారు. ఫిజిక్స్(Physics) లోనూ సుమారు 15% వరకు సిలబస్ తగ్గించాలని యోచిస్తున్నారు. దీంతో రెండు లేదా మూడు చాప్టర్లకు కోత పెట్టనున్నారు. బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లోనూ 5 నుంచి 10% వరకు సిలబస్‌ను తగ్గించనున్నారు. దీంతో పాటు ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్టుల్లోనూ కొంత సిలబస్ తగ్గనుంది. అయితే మొదటి సంవత్సరం విద్యార్థులకు 2025–26 విద్యాసంవత్సరం నుంచి, సెకండియర్ విద్యార్థులకు 2026–27 నుంచి కొత్త సిలబస్ అమలు కానుంది.