
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఎప్పటిలాగే తన పాడ్ కాస్ట్ ‘పూరి మ్యూజింగ్స్’ లో మరో ఆసక్తికర స్టోరీని తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ బాలరాజు అనే భక్తుడు దేవుడికి మధ్య జరిగిన సంభాషణను కథ రూపంలో చెప్పుకొచ్చారు. యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ పాడ్ కాస్ట్ కు ఇప్పుడు భారీగా స్పందన లభిస్తోంది. మరి దేవుడికి-బాలరాజుకు మధ్య జరిగిన సంభాషణ ఏంటో మనమూ విందామా..?
దేవుడు-బాలరాజు మధ్య ముచ్చట
కష్టాలు తట్టుకోలేక కఠోర తపస్సు చేసిన బాలరాజుకు దేవుడు ప్రత్యక్షమై చిరాకుగా ‘ఏంటి’ అన్నట్లు చూశాడు. అప్పుడు బాలరాజు.. ‘‘స్వామి ఖర్చులు ఎక్కువైపోయాయి. కోట్లకు కోట్లు కావాలి. కాస్త మీ దగ్గర క్యాష్ ఏదైనా ఉంటే నా అకౌంట్‌లో డిపాజిట్ చేస్తారా’ అని అడిగాడు. ‘నా దగ్గర క్యాష్ ఉండదు నాయనా! బ్యాంకు అకౌంట్ కూడా లేదు’ అని అప్పుడు ఆ భగవంతుడు సమాధానమిచ్చాడు.
నీకిస్తే అందరూ అడుగుతారమ్మా
‘పోనీ బంగారం, వజ్రాలు ఏమీ లేవా స్వామి’ అని అడగ్గా.. ‘నీకిస్తే అందరూ అడుగుతారమ్మా! అందుకే దగ్గర పెట్టుకోలేదు’ అని చెప్పాడు ఆ దేవుడు. ‘సరే.. నాకు ఆనందాన్ని ప్రసాదించు’ అని మరో కోరికను దేవుడి ముందు పెట్టాడు బాలరాజు. ‘సంతోషం అనేది మనసుకు సంబంధించింది. నువ్వు రోజూ లేనిదాని గురించి ఆలోచిస్తే, ఇంకా ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది’ అని ఆ ఆదిదేవుడు సమాధానం ఇచ్చాడు.
బాలరాజు : ‘అయితే, నా జీవితంలో కష్టాలనేవి లేకుండా తీసెయ్’
దేవుడు : ‘అవి తీసేస్తే ఎలా? కష్టాల తర్వాతే కదా సుఖాలు వచ్చేదని రూల్స్ రాసుకున్నాం. సుఖాలు కావాలంటే కష్టాలు పడాల్సిందే’
బాలరాజు : ‘ఓహో.. ఓకే స్వామి. నాకు తాగుడు ఎక్కువైపోయింది మందు మానేసేలా చేయగలరా?’
దేవుడు : ‘అరేయ్ నాయనా.. ఆ మందు మొదలు పెట్టింది నువ్వు కదా.. నువ్వే మానేయాలి’
బాలరాజు : ‘అయితే, స్వామి ఈ మధ్య అందరి మీదా అరుస్తున్నా. కాస్త సహనం ప్రసాదించగలరా?’
దేవుడు : ‘అది నేను ఇవ్వాల్సిన పనిలేదు బాలరాజు.. కష్టాలు పడి, పడి సరదా తీరిపోతే, ఎక్కడిలేని సహనం వచ్చేస్తుంది’
బాలరాజు : ‘అలాగైతే నాకు జ్ఞానోదయం ప్రసాదించి బుద్ధుడిలా మార్చు స్వామి’
దేవుడు : ‘బుద్ధుడికి కూడా నేను ఇవ్వలేదు బాబూ.. ధ్యానం చేస్తే, జ్ఞానోదయం కలిగింది. నువ్వు కూడా ప్రయత్నించు పెద్ద పని కాదు..’
బాలరాజు : ‘వద్దులే స్వామి.. అంత ఓపిక లేదు. పోనీ ఈ కొత్త సంవత్సరం అయినా నా జీవితం మారుతుందా?’
దేవుడు : ‘‘రేయ్.. రోజూ సెలబ్రేట్ చేసుకోమని, నీకు ఇంత పొడుగు జీవితం ఇస్తే, నువ్వు ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకుని, జీవితం మారుతుందా? అని నన్ను అడిగితే ఎలా?’
బాలరాజు : ‘మరి ఎవరిని అడగాలి.. పైగా తిక్క తిక్క సమాధానాలు చెబుతున్నావు. అసలు నిన్నెందుకు మొక్కాలి’
దేవుడు : ‘ఎవడు మొక్కమన్నాడు రా..!’ ‘నాకోసం ఇంత పెద్ద తపస్సు చేశావు. ఆ తపస్సు నీకోసం చేసుకోవచ్చు కదా!. అన్నీ నేనే ఇస్తే, నువ్వెందుకు? చేతకాకపోతే ప్యాకప్ చెప్పి, పైకి వచ్చెయ్..’
(ఆ మాట విని బాలరాజు కంగుతిన్నాడు)
‘మళ్లీ చెబుతున్నా బంగారం.. నీకు అన్నీ ఇచ్చాను. ఇప్పుడు ఇంకో కొత్త సంవత్సరం ఇస్తున్నా. వాడుకుంటే వాడుకో.. ఆడుకుంటే ఆడుకో.. తాగుతావో తందనాలు ఆడతావో నీ ఇష్టం. ప్రతిదానికీ నన్ను పిలవకు. హ్యాపీ న్యూఇయర్’’ అని బాలరాజు డిప్పపై కొట్టి, చిటికెలో మాయం అయిపోయాడు.