
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా (Rythu Bharosa) డబ్బులు పడ్డాయి. ఈ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తొలి విడతలో మండలానికొక గ్రామంలో రైతు భరోసా సొమ్మును విడుదల చేసినట్లు తెలిపారు. సోమవారం రోజున 4,41,911 రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు వెల్లడించారు. 577 మండలాల్లోని 9,48,333 ఎకరాలకు రూ.563 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు.
ఈ ప్రక్రియ కొనసాగుతుంది
వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా (Indiramma Athmiya Bharosa) నిధుల జమ కొనసాగుతుంది. అర్హులైన ప్రతి రైతుకు రైతుభరోసా నిధులను జమ చేస్తాం. సాగు యోగ్యం కాని భూముల గుర్తింపు సర్వేకొనసాగుతుంది. మార్చి 31లోపు లబ్ధిదారులందరికీ నిధుల జమ పూర్తి చేస్తాం. అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala on Rythu Bharosa) తెలిపారు.
ఒకే రోజు 4 పథకాలు ప్రారంభం
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Housing Scheme), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను సీఎం రేవంత్ రెడ్డి జనవరి 26వ తేదీన నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే జనవరి 26న ఆదివారం కావడంతో ఆ డబ్బులు జమ కాలేదు. అయితే సోమవారం ఉదయాన్నే రైతుల అకౌంట్లలో రైతు భరోసా నగదు జమ చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.