తెలంగాణ ఆర్టీసీ(Telangana RTC)లో మరోసారి సమ్మె సైరన్ మోగింది. పలు డిమాండ్లు ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిన ఉద్యోగుల జేఏసీ..  బస్‌ భవన్‌లో సోమవారం రోజున ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు (TGSRTC JAC Strike) ఇచ్చింది. తాము పేర్కొన్న డిమాండ్లు నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు భారీ ఎత్తున బస్‌ భవన్‌ వద్దకు రావడంతో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ డిమాండ్లు ఇవే

గతంలో ప్రభుత్వం హామీలను అమలు చేయాలి
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం జరగాలి
2 పీఆర్‌సీలు అమలు చేయాలి
సీసీఎస్, పీఎఫ్ డబ్బులు రూ.2,700 కోట్లు వెంటనే చెల్లించాలి

హామీలు అమలు చేయాలి

ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆర్టీసీ జాయింట్ యాక్షన్​ కమిటీ (జేఏసీ) ఆరోపించింది. ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలు, నిర్వహణను ప్రైవేటు కంపెనీలు చేస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.  ట్రేడ్‌ యూనియన్లకు ఎన్నికలు నిర్వహించకుండా, యూనియన్లను రద్దు చేసి, కార్మికులకు పనిగంటలు పెంచారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి అని జేఏసీ డిమాండ్‌ చేసింది.