తెలంగాణలో నేటి నుంచి(Jan 2) టెట్(Teacher Eligibility Test) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు 20 సెషన్లలో కంప్యూటర్ బేస్ట్ పరీక్షలు(CBT) జరగనున్నాయి. ఈసారి టెట్ పేపర్-1కి 94,327 మంది ఎగ్జామ్ రాస్తుండగా.. పేపర్-2కి 1,81,426 మంది అప్లై చేసుకున్నారు. మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రోజూ ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాల్లో 92 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.

ఇక ఉద‌యం సెష‌న్‌కు హాజ‌ర‌య్యే అభ్యర్థుల‌ను ఉద‌యం 7.30 నుంచి ప‌రీక్షా కేంద్రాల్లో(Examination Centres)కి అనుమ‌తిస్తారు. మ‌ధ్యాహ్నం సెష‌న్‌కు హాజ‌ర‌య్యే వారిని మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల నుంచి లోనికి అనుమ‌తిస్తారు. ఇక ప‌రీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే ప‌రీక్షా కేంద్రం గేట్లను క్లోజ్ చేయ‌నున్నారు. ఉద‌యం సెష‌న్‌లో ఉదయం 8.45 గంటలకు, మ‌ధ్యాహ్నం సెష‌న్‌లో 1.45 గంట‌ల‌కు గేట్లను క్లోజ్‌ చేస్తారు. గేట్లు క్లోజ్‌ కాకముందే అభ్యర్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో మెగా డీఎస్సీ(Mega DSc) పూర్తి చేసిన ప్రభుత్వం.. 2వ సారి కూడా DSc నోటిఫికేషన్‌ ఇస్తామని ప్రకటించింది. గతంలో ఇచ్చిన జాబ్ క్యాలిండర్(Job Calander) ప్రకారం.. ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గత ఏడాది మెగా డీఎస్సీ ద్వారా 11 వేల టీచర్‌ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇంకా 17 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో టీచర్‌ ఉద్యోగార్థులు TET ద్వారా స్కోర్ పెంచుకుని, DSc సాధించాలని అభ్యర్థులు భావిస్తున్నారు.