
తిరుపతి(Tirupati)లో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల(Token Issuing Centers) వద్ద తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, 40 మంది వరకు భక్తులు గాయపడడం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై CM చంద్రబాబు సమీక్షించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సీరియస్ అయ్యారు. అనంతరం టీటీడీ పరిపాలన భవనంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
న్యాయ విచారణ జరిపిస్తాం..
“DSP రమణ కుమార్ బాధ్యత లేకుండా పనిచేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరనాథెడ్డిని సస్పెండ్ చేశాం. SP సుబ్బరాయుడు, JEO గౌతమి, CSO శ్రీధర్‌ను తక్షణమే ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం. ఘటనపై న్యాయ విచారణ జరిపిస్తాం.అలాగే TTD ద్వారా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తాం. తిమ్మక్క, ఈశ్వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వారికి రూ.5 లక్షల చొప్పున సాయం చేస్తాం. గాయపడిన 33 మందికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తాం. బాధలో ఉన్నప్పటికీ స్వామివారి దర్శనం చేసుకోవాలనే సంకల్పం వారిలో ఉంది. 35 మందికి శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తాం” అని చంద్రబాబు తెలిపారు.
అంతకుముందు క్షతగాత్రులకు తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈమేరకు గురువారం తిరుపతి వచ్చిన సీఎం చంద్రబాబు స్విమ్స్ ఆసుపత్రికి వద్దకు చేరుకుని, అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారిని అడిగి తొక్కిసలాట వివరాలు తెలుసుకున్నారు. స్విమ్స్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.