Hyderabad-Rain_V_jpg--816x480-4g

హైద‌రాబాద్‌ నగరంలో జోరు వాన..

హైద‌రాబాద్‌ నగరంలో జోరు వాన..

Hyderabad Rain : హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, దిల్ షుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక, హిమాయత్ నగర్, అబిడ్స్, సికింద్రాబాద్ ప్రాంతాలతో పాటు.. రాజేంద్రనగర్, తుర్కయాంజల్, కొత్తపేట, సరూర్ నగర్, నాగోల్, చైతన్యపురి, చంపాపేట, సైదాబాద్ లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది.


ఉదయాన్నే నల్లని మబ్బులు ఆకాశాన్ని కమ్ముకోవడంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. దీంతో ఉదయాన్నే కార్యాలయాలకు వెళ్లేందుకు బయలుదేరిన ఉద్యోగులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లోని రహదారులపై వర్షంపు నీరు నిలిచిపోవటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. హైదరాబాద్ శివారు ప్రాతాల్లోనూ వర్షం కురిసింది. లంఘార్ హౌస్, షేక్ పెట్, నార్సింగీ, గండిపేట్, హిమాయత్ సాగర్, పుప్పాల్ గూడ, మణికొండ ప్రాంతాలలోనూ వర్షం కురిసింది. ఖైరతాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో ఉదయం నుంచి వర్షం కురుస్తుంది.


గత కొద్ది రోజులుగా వేసవి ఎండలు, ఉక్కపోతతో హైదరాబాద్ నగరవాసులు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం ఉదయం నుంచి దాదాపు నగర వ్యాప్తంగా వర్షం కురవడంతో ఎండ వేడిమి, ఉక్కపోత నుంచి నగర వాసులకు కొంత ఉపశమనం కలిగినట్లయింది. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో పలు జిల్లాల్లోనూ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురవగా.. పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
 


Comment As:

Comment (0)