MLC KAVITHA

MLC Kavitha:కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

MLC Kavitha:కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

Telugu Fast News: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌజ్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశా రు. మరోవైపు, బెయిల్‌ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీ వాదనలు వినిపించింది. కుంభకోణంలో కవిత పాత్రను ధర్మాసనానికి వివ రించింది.

కవితను అధికారులు వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం (ED )ఈడీ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ బుధవారానికి వాయిదా వేశారు.

ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్‌ హొస్సేన్‌ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్‌టేకింగ్‌ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు.

ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్‌ ఆర్డర్‌ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు.

 నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్‌ చాట్‌లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు.
 


Comment As:

Comment (0)