doordarshan

Doordarshan: మారిన దూరదర్శన్‌ లోగో రంగు.. ‍ప్రతిపక్షాల మండిపాటు!

Doordarshan: మారిన దూరదర్శన్‌ లోగో రంగు.. ‍ప్రతిపక్షాల మండిపాటు!

ప్రభుత్వ వార్తా ఛానెల్ దూరదర్శన్ లోగో రంగు వివాదాస్పదంగా మారింది. లోగో రంగు రూబీ ఎరుపు నుండి కాషాయ రంగుకు మారింది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

ఈ ఛానెల్‌ను అధికార ప్రభుత్వం కాషాయీకరణ చేసిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు లోగోను మార్చాల్సిన అవసరం ఏమిటని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.

డీడీ న్యూస్ తన అధికారిక ఎక్స్‌ హ్యాండిల్‌లో ఒక సందేశంతో పాటు సంస్థ కొత్త లోగో వీడియోను పోస్ట్ చేసింది. 'మా విలువలు అలాగే నిలిచివుంటాయి, మేము ఇప్పుడు కొత్త అవతార్‌లో అందుబాటులోకి వచ్చాం. మునుపెన్నడూ లేని విధంగా వార్తలు వీక్షించేందుకు సిద్ధంగా ఉండండి. వేగవంతమైన వాస్తవ వార్తలు అందిస్తాం' అనే సందేశాన్ని జత చేసింది.

అయితే దీనిపై ప్రసార భారతి మాజీ సీఈఓ, టీఎంసీ రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ మాట్లాడుతూ 'జాతీయ ప్రసారకర్త దూరదర్శన్ తన చారిత్రాత్మక ఫ్లాగ్‌షిప్ లోగోను కాషాయ రంగులోకి మార్చింది. ఆ సంస్థ మాజీ సీఈఓగా నేను ఈ కాషాయీకరణను వ్యతిరేకిస్తున్నాను. ఇది ఇకపై ప్రసార భారతి కాదు, ప్రచార భారతి' అని వ్యాఖ్యానించారు. ఇదేవిధంగా కొత్త పార్లమెంట్‌లోని రాజ్యసభ ఛాంబర్‌కు కాషాయ రంగు వేయడంతోపాటు పాత భవనానికి కాషాయ రంగు పూయడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు.

 


Comment As:

Comment (0)