కొత్త రేషన్ కార్డుల (Ration Cards) కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నారా.. ఇక నుంచి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవా కేంద్రాల్లో(Mee Seva Centers) దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. మరోవైపు రేషన్ కార్డుల్లో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకునే వారికి ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. మీసేవా సెంటర్లలో సంబంధిత పత్రాలు జత చేయాలని సూచించింది.

రేషన్ కార్డు తప్పనిసరి

కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీల (Six Guarantees) అమలుకు రేషన్ కార్డులను ముఖ్య ధ్రువపత్రంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్డు ఉన్న వారికే ఈ పథకాలు వర్తిస్తాయని ప్రకటించింది. అయితే గత కేసీఆర్ సర్కార్ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను స్వీకరించకపోవడంతో అర్హులైనా రేషన్ కార్డులు లేకపోవడంతో కొంతమంది పేదలు ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నారు.

మరో ఛాన్స్

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు నేరుగా మండల కార్యాలయాల్లో సమర్పించాలని సూచించింది. గత నెలలో కొత్త రేషన్ కార్డులు (New Ration Cards in Telangana) జారీ చేయడం మొదలు పెట్టిన సర్కార్.. ఇంకా దరఖాస్తు చేసుకోని వారి కోసం ఓ అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే మీసేవా కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.