పుష్ప-2 బెనిఫిట్ షో సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట (Sandhya Theatre Case) ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. ఈ కేసులో ఆయన ఇటీవల అరెస్టు కాగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు నాంపల్లి కోర్టు 14రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే ఆ రిమాండ్‌ నేటితో ముగియనున్న నేపథ్యంలో కాసేపట్లో ఆయన కోర్టుకు రానున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు బెయిల్‌ ఇచ్చిన విషయాన్ని ఆయన లాయర్లు కోర్టు దృష్టికి తీసుకురానున్నారు. 

డిసెంబరు 4వ తేదీన పుష్ప2 సినిమా బెనిఫిట్‌ షో  (Pushpa 2 Benefit Show) సందర్భంగా హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ కు అల్లు అర్జున్ సినిమా చూసేందుకు రాగా ఆయణ్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేయగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు ప్రాణాలతో ఇప్పుడు ఆస్పత్రిలో పోరాటం చేస్తున్నాడు. తొక్కిసలాటలో మరణించిన మహిళ భర్త ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు నమోదు చేశారు.

ఈ క్రమంలో ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ అల్లు అర్జున్ (Allu Arjun Case Update) ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించగా.. అల్లు అర్జున్‌తోపాటు సంధ్య థియేటర్‌ యజమానులిద్దరికి మధ్యంతర బెయిల్‌ (Allu Arjun Bail) మంజూరు చేసింది హైకోర్టు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు నాలుగు వారాలపాటు ఈ బెయిల్‌ను మంజూరు చేస్తూ.. రూ.50 వేల వ్యక్తిగత బాండ్లు చంచలగూడ జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించాలని ఆదేశించింది.