ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు (Telugu Writers Conference) విజయవాడలో  ఘనంగా ప్రారంభమయ్యాయి. మాతృ భాషను భవిష్యత్తు తరాలకు అందించడమే లక్ష్యంగా ఈ మహాసభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలకు ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలుగు తల్లి విగ్రహానికి నివాళులర్పించారు.

విజయవాడలోని కె.బి.ఎన్‌.కళాశాల ప్రాంగణంలో ఇవాళ్టి నుంచి రెండు రోజులపాటు ఈ వేడుకలు జరగనున్నాయి. వీటి కోసం దేశవిదేశాల నుంచి 1500 మందికి పైగా కవులు, రచయితలు, భాషాభిమానులు తరలివచ్చారు. పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలో సదస్సులు, కవితా, సాహిత్య సమ్మేళనాల కోసం ప్రత్యేక వేదికలు సిద్ధం చేశారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం, కె.బి.యన్‌.కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ మహాసభలు జరుగుతున్నాయి. 

రెండ్రోజుల్లో 25కు పైగా సదస్సులు, కవితా, సాహిత్య సమ్మేళనాలు జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. వీటిలో 800 మందికి పైగా భాషాభిమానులకు వేదికలపై పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. వేయి మందికి పైగా దివంగతులైన ప్రముఖ కవుల ముఖచిత్రాలతో మహాసభల ప్రాంగణంలో ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాజకీయ, న్యాయ, పరిపాలనలో తెలుగు ప్రాధాన్యం పెంచే దిశగా ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి.